ఈ నిమ్మకాయ ధర రూ.1.48 లక్షలు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?


ప్రాచీన కాలం నాటి వస్తువులను వేలం వేయడం మన అందరికీ తెలిసిందే. నాటి వస్తువులకు ప్రత్యేకంగా అభిమానులున్నారు. వాటిని సొంతం చేసుకోవడానికి వేలం పాటలో ఎంతకైనా వెచ్చిస్తారు.
అలాంటివాటిని తమ ఇళ్లల్లో పెట్టుకుని స్టేటస్‌ సింబల్‌ గా భావిస్తుంటారు. ఇలా విగ్రహాలు, రాజులు, రాణులు ధరించిన వస్త్రాలు, వారు వాడిన పాత్రలు, కళాఖండాలు, పెయింటింగ్స్, ప్రముఖులు వాడిన పెన్నులు, పాత కాలం నాటి కరెన్సీ.. ఇలా అనేకమైన వాటిని దక్కించుకోవడానికి లక్షలు, కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతుంటారు.

అయితే.. ఇప్పుడు చెప్పుకోబోతున్న వేలం మాత్రం ప్రత్యేకం. ఇది అలాంటి ఇలాంటి వేలం కాదు. ఒక నిమ్మకాయను వేలంలో దక్కించుకోవడానికి ఏకంగా రూ.1.48 లక్షలు ఖర్చుపెట్టారు. అంటే దాదాపు లక్షన్నర రూపాయలు వెచ్చించారు. మరి ఈ నిమ్మకాయకు అంత ధర దేనికి.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలనుందా.. అయితే చదివేయండి…
ఇంగ్లాండ్‌ లోని ఒక కుటుంబానికి ఒక విచిత్రమైన నిమ్మకాయ కనిపించింది. అది 18వ శతాబ్దం కాలం నాటిది. అప్పట్లో మంత్రివర్గంలో ఉన్న వారిది ఆ నిమ్మకాయ అని తెలుస్తోంది. నిమ్మకాయపై ఒక ప్రత్యేక సందేశం కూడా రాయబడి ఉంది. 2 అంగుళాల వెడల్పుతో గోధుమ రంగులో ఆ నిమ్మకాయ ఉంది. ఎండిపోయిన ఆ నిమ్మకాయపై చెక్కిన సందేశం ఒకటి ఉంది.

నిమ్మకాయపై ఉన్న సందేశం ప్రకారం.. అది 1739 సంవత్సరం నాటిదని తెలుస్తోంది. ఎండిపోయిన నిమ్మకాయపై ‘మిస్టర్‌ పి లూ ఫ్రాంచినీ నవంబర్‌ 3, 1739 మిస్‌ ఇ బాక్స్‌ టర్‌ కి అందించారు’ అనే సందేశం ఉంది.
దీంతో తమకు కనిపించిన ఆ నిమ్మకాయను తీసుకుని ఆ కుటుంబం ఇంగ్లాండ్‌ లోని ష్రాప్‌ షైర్‌ లో వేలం పాడుకునేవారిని కలిసింది. దీంతో ఈ నిమ్మకాయ లోపల అసలు ఏముందో తెలుసుకోవాలని చాలామంది దానికి ఆసక్తి చూపారు. దీంతో ఆ నిమ్మకాయను దక్కించుకోవడానికి వేలంలో పోటీ పడ్డారు.

కాగా ఈ నిమ్మకాయ వేలంలో 40 నుంచి 60 పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 4,000-రూ. 6,000) పలుకుతుందని అంచనా వేశారు. అయితే ఆ కుటుంబం ఆశ్చర్యపోయేలా ఆ నిమ్మకాయకు వేలంలో భారీ ధర దక్కింది. నిమ్మకాయ ఏకంగా 1416 పౌండ్లు (భారత కరెన్సీలో రూ.1.48 లక్షలు)కు అమ్ముడుపోయింది.
బ్రెట్టెల్స్‌ వేలం పాటల యజమాని డేవిడ్‌ బ్రెట్టెల్‌ నిమ్మకాయను వినోదం కోసం అమ్మాలని అనుకుంటే.. అందరికీ షాకిచ్చే రేటుకు అమ్ముడైంది. బ్రెట్టెల్స్‌ ఆక్షన్‌ హౌస్‌ ఈ విషయాన్ని ఇనస్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేయడంతో ఇది వైరల్‌ అవుతోంది.

See also  Foldable House : మడత పెట్టే ఇల్లు వచ్చేసిందోచ్..ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
,