Telangana Cabinet Meet : ఆదివారం తెలంగాణ కేబినెట్ భేటీ – కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ !


Telangana Cabinet meeting will be held on Sunday : తెలంగాణ మంత్రి వర్గం ఆదివారం సమావేశం అవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో త్వరలో శాసనసభలో ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి ప్రధానంగా చర్చించనున్నారు.
గురువారం మోడీ సర్కార్ ప్రతిపాదించిన బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక సాయాలూ లేని సంగతి విదితమే. రాష్ట్ర విభజన హామీలు సైతం అటకెక్కాయి. బడ్జెట్ ఆధారంగా, అక్కడ కేటాయింపులపై అంచనా వేసుకుని రూపొందిస్తున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై క్యాబినెట్ సీరియస్గా చర్చించనుంది.

గ్యారంటీల అమలుపై కీలక నిర్ణయాలు

ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు, నిధుల కేటాయింపునకు సంబంధించిన వివరాలను సేకరించిన ఆర్థిక శాఖ వాటిని మంత్రివర్గానికి సమర్పించనుంది. ఆయా వివరాలపై లోతుగా చర్చించిన తర్వాత… ఓటాన్ అకౌంట్ పద్దుకు తుది రూపు ఎలా ఇవ్వాలనే అంశంపై క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోనుంది. దీంతోపాటు ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండింటిని (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంపు) అమలు చేసిన క్రమంలో మిగిలిన వాటిలో ముఖ్యమైన రెండు అంశాలు .. 200 యూనిట్లలోపు కరెంటు వాడే వారికి ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పై కూడా సీఎం తన మంత్రివర్గ సహచరులతో సమాలోచనలు చేయనున్నారు.

ఈ నెలలోనే రెండు హామీల అమలు

రెండు హామీల కోసం వచ్చిన దరఖాస్తులెన్ని? లబ్దిదారుల సంఖ్య ఎంత? ఇప్పటి వరకూ ఎన్ని అప్లికేషన్లను పరిశీలించి, పరిష్కరించారనే విషయాలపై ముఖ్యమంత్రి వివరాలను తెలుసుకోనున్నారు. వాటి అమలుకు ఎన్ని నిధులను కేటాయించాలి..? ఆ సొమ్మును ఏ రూపంలో సమకూర్చుకోవాలనే విషయాలపై కూడా క్యాబినెట్ చర్చించనుంది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి, కొత్త పాలక మండలిని నియమించిన నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా మంత్రివర్గం చర్చించనుందని ఉన్నతాధికారులు వివరించారు. అత్యంత కీలకమైన ఈ క్యాబినెట్ సమావేశానికి విధిగా హాజరు కావాలంటూ అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఓటాన్ అకౌంట్ ఆమోదం కోసం మరో వారంలో కేబినెట్ భేటీ

ప్రతీసారి బడ్జెట్ ప్రతిపాదనకు ఒక రోజు ముందు క్యాబినెట్ సమావేశమై… పద్దుకు ఆమోదముద్ర వేయటం ఆనవాయితీ. ఈనెల రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు సర్కార్ సమాయత్తమవుతున్న క్రమంలో… ఆదివారం నిర్వహించబోయే క్యాబినెట్ కాకుండా మరో వారం రోజుల్లో ఇంకోసారి మంత్రివర్గం సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సర్కారు ఆమోదిస్తుందని సమాచారం.

See also  BREAKING: రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. కీలక అధికారికి రిజైన్ చేయాలని ఆర్డర్