Sunday Motivation: విజయానికి దగ్గర దారి ఒక్కటే… కష్టపడి పనిచేయడం


Sunday Motivation: ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు నివసించేవాడు. అతనికి బంగారం పండే చక్కటి పొలాలు ఉన్నాయి. ఆయన కష్టపడి పనిచేసి చాలా సంపాదించాడు. అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు.
శక్తివంతులై ఉండి కూడా వారు ఏ పనీ చేసేవారు కాదు. రైతుకు వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. వారు పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి భవిష్యత్తు ఏమైపోతుందోనని చాలా ఆందోళన చెందాడు.

వయసు మీద పడడంతో ఒకరోజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మరణం సమీపిస్తుందని ఆయనకి అర్థం అయింది. వెంటనే తన ముగ్గురు కొడుకుల్ని పిలిచాడు. ‘నాకు మరణం సమీపిస్తున్నట్టు అర్థం అవుతోంది. అందుకే మీతో ఒక రహస్యాన్ని చెప్పాలని పిలిచాను. మన పొలాల కింద ఎక్కడ ఒక మూల నిధి దాచి పెట్టాను. ఎక్కడ దాచి పెట్టానో మర్చిపోయాను. మీరు ఆ పొలం మొత్తం తవ్వి వెతుక్కోండి. మీకు ఆ నిధి దొరికితే అదృష్టవంతులే’ అని చెప్పాడు.
అంతవరకు పొలం జోలికి వెళ్ళని కొడుకులు పొలాన్ని తవ్వడం ప్రారంభించారు. పది ఎకరాల పొలాన్ని తవ్వారు. కానీ వారికి నిధి దొరకలేదు. నాన్న అబద్ధం చెప్పారంటూ తిట్టుకున్నారు. ఎలాగూ తవ్వారు కాబట్టి, కొన్ని విత్తనాలు జల్లితే మంచిదని చెప్పింది వారి తల్లి. దాంతో వారు తవ్విన పొలంలోనే విత్తనాలను చల్లారు. కొన్ని రోజులకే వర్షాలు పడి ఆ విత్తనాలు మొలకెత్తి పంట విరగ కాసింది. దాన్ని అమ్మితే లక్షల కొద్ది డబ్బు వచ్చింది. కొడుకులు చాలా సంతోషించారు. వారి తల్లి ఆ ముగ్గురుని పిలిచి మీ నాన్న చెప్పిన నిధి మీకిప్పుడు దొరికింది… అని చెప్పింది. కొడుకులు తండ్రి మాటల వెనుక ఉన్న భావాన్ని అప్పుడు అర్థం చేసుకున్నారు. ఏదైనా సరే… కష్టపడితేనే దక్కుతుందని వారికి అర్థమైంది.
ఈ కథలో నీతి ఒక్కటే… కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. శ్రమ వల్ల దక్కిన ఫలితం ఎప్పుడూ తీపిగానే ఉంటుంది. విజయం దక్కాలంటే కష్టపడి పని చేయాలి. కష్టపడకుండా విజయం కావాలంటే దొరకదు.

See also  Drinking Water: పళ్ళు తోముకుండా ఉదయాన్నే నీటిని తాగితే ఏం జరుగుతుంది తెలుసా?