Runing: అతిగా చేస్తే పురుషులకు ప్రమాదం.. మహిళలకు మాత్రం మాంచి ఎక్సర్‌సైజ్ అంటున్న పరిశోధనలు


బాడీ ఫిట్‌నెస్ కోసం ఎక్కువ మంది నడకకు ప్రాధాన్యత ఇస్తారు. మరికొందరు పరుగెత్తుతుంటారు. అయితే అతిగా పరుగెత్తడం వల్ల మొదటికే మోసం వస్తుంది.
సుదూర పరుగు కారణంగా పురుషులకు గుండెపోటు, స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది.

బార్ట్స్ హార్ట్ సెంటర్ చేసిన పరిశోధనలో.. రన్నింగ్ పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని తేలింది.

ఎక్కువ దూరం పరుగెత్తే మగ అథ్లెట్లలో వారి ప్రధాన ధమనులు ఊహించిన దాని కంటే చాలా దృఢంగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తద్వారా వారికి గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని స్టడీలో తేలింది.

అధ్యయన వివరాలు

అధ్యయనం ప్రకారం మారథాన్స్, ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్స్, సైక్లింగ్ ఈవెంట్‌లలో క్రమం తప్పకుండా పాల్గొనే పురుషుల వయస్సు కంటే వారి ధమనుల వయస్సు 10 సంవత్సరాలు పెద్దగా ఉంటుంది.

మారథాన్‌ల వంటి ఈవెంట్లు మహిళల ఆరోగ్యాన్ని పెంచుతాయని అధ్యయనంలో తేలింది. రన్నింగ్ మహిళల్లో రక్తనాళాల వయస్సును సగటున ఆరు సంవత్సరాలు తగ్గించింది. 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న రన్నర్ల పరిశీలన ఆధారంగా ఈ అధ్యయన నివేదిక రూపొందించారు.

300 కంటే ఎక్కువ మంది రన్నర్లు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరు 10 కంటే ఎక్కువ మారథాన్ ఈవెంట్లలో పాల్గొన్నారు. అంతేకాకుండా కనీసం 10 సంవత్సరాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేశారు.

రన్నింగ్‌పై అపోహలు

మహిళలు పరుగెత్తవద్దని తరచుగా సలహా ఇస్తుంటారు. కుంగిపోయిన దవడ, ముడతలు, మచ్చలు ఏర్పడతాయని మహిళలు పరుగెత్తడానికి భయపడతారు. అయితే ఈ అధ్యయనం ద్వారా ఇప్పటి వరకు ఉన్న అపోహలన్నింటికీ చెక్ పెట్టినట్లయింది.

పరుగెత్తడం ఆరోగ్యానికి మంచిదే. అయితే అలా చేస్తున్నప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు. సరైన దుస్తులను ధరించాలి. మంచి రన్నింగ్ షూస్ కూడా తప్పనిసరి. మహిళలు స్పోర్ట్స్ బ్రాలు ధరించాలి.

పరుగులో వేగాన్ని ఎప్పుడు పెంచాలో, ఎప్పుడు నెమ్మదించాలో తెలుసుకోండి. పరుగును వెంటనే ఆపకూడదు. మీరు ఆగిపోయే వరకు వేగాన్ని నిదానంగా తగ్గించుకుంటురావాలి.

ఈ జాగ్రత్తలు ముఖ్యం

కాళ్లు, కీళ్లలో నిరంతర నొప్పి ఉన్నప్పుడు రన్నింగ్ ఆపండి. ఇందుకు ప్రత్యామ్నాయంగా సైక్లింగ్ లేదా ఈత వంటి ఇతర వ్యాయామాలను ప్రయత్నించడం మంచిది.

అతిగా పరుగెత్తడం వల్ల శరీరానికి ఎక్కువ హాని కలుగుతుంది. ఇలా చేయడం వల్ల అరికాలు ఫాసిటిస్ గా మారవచ్చు. అంటే మడమ దగ్గర పదునైన నొప్పితో ఉండే ఒక రకమైన వాపు.

అంతేకాకుండా అధిక వ్యాయామం కూడా రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. ఆకలిని కూడా ప్రభావితం చేస్తుంది.

See also  రాబోయే 10 సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. వెంటనే ఈ 4 పనులు చేయటం అలవాటు చేసుకోండి..!