మజ్లిస్ కు రేవంత్ మార్క్ చెక్ ? ఇండియా కూటమిలోకి ఎంబీటీ-హైదరాబాద్ ఎంపీ సీటూ !


తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ సీట్లు గెల్చుకుని అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి రాజధాని హైదరాబాద్ పరిధిలో ఒక్కసీటు కూడా గెలవలేకపోవడం పెద్ద మైనస్ గా మారింది.
దీంతో వచ్చిన కసో, మరో కారణమో తెలియదు కానీ హైదరాబాద్ విషయంలో దీర్ఘకాలిక వ్యూహాలకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపుతున్నారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు సహకరించి కాంగ్రెస్ ఓట్లు చీల్చి ఆ పార్టీ అభ్యర్ధుల ఓటమికి కారణమైన స్ధానిక పార్టీ ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు సీరియస్ కసరత్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగా పాతబస్తీలో ఎంఐఎం ప్రత్యర్ధి ఎంబీటీని ఓ రేంజ్ లో ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇప్పటికే గత ఎన్నికల్లో ఎంఐఎం గెలిచిన ఏడు సీట్లలో రెండు సీట్లు యాకుత్ పురా, నాంపల్లిలో గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ ను భవిష్యత్తులో ఎంబీటీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లేలా రేవంత్ ప్లాన్ చేసారు. ఇందులో భాగంగా ఎంబీటీ నేత అంజాదుల్లా ఖాన్ ను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఎంఐఎంకు బలమున్న ప్రతీ చోటా ఇకపై ఎంబీటీని ప్రోత్సహించబోతున్నారు.

ఎంబీటీతో నేరుగా కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడమే కాకుండా ఆ పార్టీ నేతృత్వంలో సాగుతున్న ఇండియా కూటమిలోకీ చేర్చుకునేలా రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున అధిష్టానం దూతలు ఎంబీటీ నేతలతో ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్ధాయిలో ఎంఐఎంకు పోటీగా ఎంబీటీని అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఎంబీటీకి మరో కీలక ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారు.

ఇన్నాళ్లూ ఎంఐఎం వరుసగా గెలుస్తూ, తన సొత్తుగా భావిస్తున్న హైదరాబాద్ ఎంపీ సీటులో ఎంబీటీ అభ్యర్ధిని పోటీకి పెట్టి అన్ని విధాలా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తద్వారా అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఇప్పుడు మొదలైతే భవిష్యత్తులో ఎంఐఎం కంచుకోటల్ని బద్దలు కొట్టి తన మిత్రపక్షం ఎంబీటీతో పాగా వేయించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ పరిధిలో ఎంబీటీ సాయంతో కాంగ్రెస్ బలపడాలన్నది ఈ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.

See also  డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్..ఎల్లుండి డబ్బులు జమ !