‘మై మెమోరీస్‌ ఆఫ్‌ టోటల్‌ కమిట్‌మెంట్‌’ -ఓ విజేత ‘డైరీ’..నా జీవితంలో మరోసారి ప్రిలిమ్స్‌ రాయను. ఇదే చివరిది’.. ఓ కుర్రాడు తన డైరీలో రాసుకున్న మాటలు.. బయటి ప్రపంచానికి కనపడకూడదని గుండు చేయించుకున్నారు. వెంట్రుకలు తిరిగి వచ్చేలోపు ప్రిపరేషన్‌ పూర్తి కావాలని తన రూమ్‌కే పరిమితమయ్యారు…విజేతగా నిలిచారు…


ఓ విజేత ‘డైరీ’..
ప్రస్తుతం తిరుపతి అర్బన్ ఎస్పీగా నియామకం అయిన ఆవుల రమేష్ రెడ్డి.. స్టోరీ..
‘నా జీవితంలో మరోసారి ప్రిలిమ్స్‌ రాయను. ఇదే చివరిది’.. ఓ కుర్రాడు తన డైరీలో రాసుకున్న మాటలివి. ఆ మాటలో సాధిస్తానన్న విశ్వాసం, ఆత్మస్థైర్యం తొణికిసలాడింది. అనుకున్నట్టే ఆయన సంకల్పం ముందు విజయం మోకరిల్లింది. ఆ మాటలు అక్షర సత్యం అయ్యాయి. విజేతగా నిలబడేందుకు ఆ కుర్రోడు పడ్డ తపన, శ్రమ ఎందరికో స్ఫూర్తికలిగిస్తాయి. ఇవాళ వందలాది మంది సివిల్స్‌ విజేతలకు రోల్‌ మోడల్‌ ఆయన. అచీవర్స్‌ స్టోరీస్‌ సగర్వంగా అందిస్తున్న ఐపీఎస్‌ అధికారి ఆవుల రమేష్ రెడ్డి సక్సెస్‌ స్టోరీ..

చాలా మంది తమ మనసులో మాటను డైరీ రూపంలో నిక్షిప్తం చేస్తుంటారు. అయితే విజయాన్ని ముందే ఊహించి ఓ డైరీలో రాసుకోవడం ఎప్పుడైనా విన్నారా? రమేష్ రాసిన డైరీ ‘మై మెమోరీస్‌ ఆఫ్‌ టోటల్‌ కమిట్‌మెంట్‌’ అలాంటిదే. ఉన్నతమైన స్థానంలో తనను చూసుకోవాలని చిన్ననాటి నుంచే ఆయన కల కన్నాడు. తన కష్టానికి ఫలితం ఉంటుందని, విజేతను అవుతానని తన లక్ష్యాన్ని అక్షర రూపం చేసుకున్నారు. పోటీపరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న సమయంలో 2001లో మై మెమోరీస్‌ ఆఫ్‌ టోటల్‌ కమిట్‌మెంట్‌ రూపుదిద్దుకుంది. తనను తాను స్ఫూర్తి పొందడానికి ఎందరో విజేతల ఫోటోలు పదిలపర్చుకున్నారు ఆ డైరీలో. ఎంత కష్టపడితే ఇలా విజేతలు అవుతారో అంటూ తనకుతాను మోటివేట్‌ అయ్యేవారు. వాళ్ల స్థాయిలోనే తానూ అచీవ్‌ అవ్వాలని పట్టుదలతో ఉండేవారు. మనసును హత్తుకునే సంఘటనల చిత్రాలెన్నో ఆ అమూల్యమైన డైరీలో చోటుసంపాదించాయి. ఇప్పుడా డైరీ ఎందరికో స్ఫూర్తి కలిగించే అపురూప కళాఖండం అంటే ఆశ్చర్యమేయక మానదు.

రమేష్ రెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని జాల్లపాలెం. తండ్రి తిరుపతి రెడ్డి సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో వార్డెన్‌. తల్లి లక్ష్మి నారాయణమ్మ గృహిణి. ఇంటర్‌ వరకు రమేష్ విద్యాభ్యాసం కనిగిరి, దాని చుట్టుపక్కల ఊర్లలో జరిగింది. మేనమామ మంత్రి కావడం, బంధువుల్లో సివిల్‌ సర్వెంట్స్‌ ఉండడం రమేష్ ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవి. ఉన్నతమైన స్థానంలో తనను తాను చూసుకోవాలని కలలు కనేవాడు. ఏ ఊర్లో పనిచేసినా హాస్టల్‌ పక్కనే ఇల్లు తీసుకుని ఉన్న తన తండ్రి అనుసరించిన విలువలే రమేష్ మనసులో చెరగని ముద్రవేశాయి. ఇంటర్లో తాలూకా ఫస్ట్‌ రావడంతో ఆయనలో మనోధైర్యం పెంచింది. ఎంసెట్‌లో 1,461 ర్యాంకు వచ్చినా ఎంబీబీఎస్‌ సీటు రాలేదు. ఏదైతేనేం బాపట్లలో బీఎస్సీ అగ్రికల్చర్‌ సీటు రావడం గొప్పగా భావించారు. బాపట్ల కళాశాల విద్యార్థులు ఎందరో సివిల్స్‌ సాధించడమే వారి ఆనందానికి కారణం.

డిగ్రీ పూర్తి అయ్యాక కోయంబత్తూరులోని తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో చేరారు. అదే సమయంలో సివిల్‌ సర్వీసెస్‌ వైపు బీజం పడింది. రైటింగ్‌ స్కిల్స్‌ తనకు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఫారెస్ట్‌ సర్వీసెస్‌ పరీక్ష రాశారు. ఇంటర్వ్యూ దాకా వెళ్లారు. 2003లో మరోసారి ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ దాకా వెళ్లినా ఫలితం దక్కలేదు. సబ్జెక్ట్స్‌ పరంగా మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్వ్యూలో పోవడంతో చాలా బాధపడ్డారు. ఆ షాక్‌ నుంచి చాలా రోజులు కోలుకోలేదు. సివిల్స్‌కు ఏం చదవాలో తెలీదు. మార్గదర్శి ఎవరూ లేరు. అయినాసరే తన లక్ష్య సాధనలో ఎక్కడా వెనక్కి చూడలేదు రమేష్. శిక్షణ కోసం ఢిల్లీలో అడుగుపెట్టారు. స్నేహితుల గదిలో మకాం.

సైన్స్‌ సబ్జెక్టులతో సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లోనే అపజయం ఎదురైంది. రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ దాకా వెళ్లి వెనక్కి వచ్చేశారు. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మూడు ప్రయత్నాలు విఫలం కావడంతో అందరూ సానుభూతి చూపేవారు. సానుభూతి తిండిపెట్టదని రమేష్ భావించారు. ఢిల్లీ నుంచి మకాం హైదరాబాద్‌కు మార్చారు. తనకు తాను మోటివేట్‌ కావడానికి, ఒత్తిడిని జయించడానికి క్రికెట్‌ను దినచర్యలో భాగం చేసుకున్నారు. నాల్గవ ప్రయత్నంలో పబ్లిక్‌ అడ్మిన్, ఆంత్రోపాలజీతో రంగంలోకి దిగారు. 2006 మే నెలలో ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ కాగానే తాను ఈ ఏడాది సివిల్స్‌ సాధించబోతున్నానని ప్రగాఢంగా నమ్మారు. ఇదే చివరి ప్రిలిమ్స్‌ కాబోతోందని డైరీలో గర్వంగా రాసుకున్నారు. రాసుకున్న కొన్ని గంటల్లోనే ఓ మిత్రుడి నుంచి ఫోన్‌.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్‌ లీక్‌ అయిందన్నది ఆయన నుంచి వచ్చిన సమాచారం. ఈ హఠాత్‌పరిణామంతో రమేష్ ఒక్కసారి షాక్‌ అయ్యారు. ఏదైతేనేం మళ్లీ పెట్టిన ఆ ఎగ్జామ్‌లో పాస్‌ అయ్యారు.

మెయిన్స్‌కు కఠోర శ్రమ చేశారు. బయటి ప్రపంచానికి కనపడకూడదని గుండు చేయించుకున్నారు. వెంట్రుకలు తిరిగి వచ్చేలోపు ప్రిపరేషన్‌ పూర్తి కావాలని తన రూమ్‌కే పరిమితమయ్యారు. వెంట్రుకలు లేకపోతే ఒకపట్టాన ఎవరినీ కలవడానికి మనసు ఒప్పదు కాబట్టే గుండు గీయించుకున్నానని అంటారు రమేష్ రెడ్డి. ‘ప్రిపరేషన్‌ సమయంలో ఫోన్‌ లేకుండా ఆ రోజులు గడిపాను. బయటి ప్రపంచానికి దూరంగా ఉన్నాను. సివిల్స్‌ ఈసారి సాధించాల్సిందేనని పట్టుబట్టాను. 54వ ర్యాంకుతో ఐపీఎస్‌ వచ్చింది. మావాడు ఎప్పటికైనా సివిల్స్‌ సాధిస్తాడు అని గర్వంగా చెప్పుకునే నాన్న మాటలు నిజం చేశాను. ప్రయత్నం వదలవద్దని అమ్మానాన్న చెప్పేవారు. ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే ఏ కల అయినా పిల్లలకు సాధ్యమే. లక్ష్య సాధనలో ఎన్నడూ బాధపడలేదు. అదృష్టాన్ని నమ్మను. నా కష్టాన్ని నమ్ముకున్నాను. ఐడెంటిటీ కోసమే నా కష్టమంతా’ అని గర్వంగా చెప్పారు.

పోటీ పరీక్షల్లో ఎంపిక విధానమే బాగోలేదని కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు రమేష్. ఎంతో కష్టపడి మెయిన్స్‌ పాసైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ మార్కులు వారి భవిష్యత్‌ను నిర్ణయించడం బాగోలేదని అంటారు. ‘పరీక్షా విధానంలో సమూల మార్పులు రావాలి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక ఉండాలి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థులూ సమర్థులే అన్న విషయం బోర్డు గ్రహించాలి. ఇంటర్వ్యూలో అభ్యర్థి క్వాలిటీని మాత్రమే చూడాలి’ అంటూ తన మనసులో మాట చెప్పారు.

కుటుంబ బంధాలకు ఎక్కువ విలువ ఇస్తానని అంటారు రమేష్. ‘వారితో గడపాలని ఎప్పుడూ అనుకుంటాను. అందుకే సెలవులకు ఊరెళ్లడం, పండుగలు పల్లెటూర్లో జరుపుకోవడం చేస్తుంటా. అక్కడి ఆత్మీయ స్పర్శ మరువలేనిది. ఆ అనుభూతిలో మునిగిపోవాలి. స్నేహితులూ నా కుటుంబంలో భాగమే. ఎన్ని పదవులు వచ్చినా నడిచిన దారి మరువరాదు. మానవ సంబంధాలకు విలువ ఇవ్వాలి. నా జీవితంలో అందరి రోల్‌ ఉంటుంది. నన్ను రోల్‌ మోడల్‌గా తీసుకుని సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నవారెందరో. కనిగిరిలో ప్రతి ఇంటా నన్ను అభిమానించేవారుండడం గొప్ప అనుభూతి. ఈ 10 ఏళ్ల కాలంలో సివిల్స్‌ సాధించిన ప్రతి ఒక్కరి మనసులో నేనున్నాను’ అని వినమ్రంగా చెప్పారు.

సివిల్స్‌ సాధించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఒక సామాజిక బాధ్యత అప్పగించాలి. ఇలా చేస్తే ఎంతో మార్పును చూడొచ్చు అని అంటారు రమేష్ రెడ్డి. ‘సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటా. సమాజాన్ని ప్రత్యక్షంగా చూడడం ఇష్టం. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు వెన్నంటి ఉంటాను. ఇతర విజేతలతో ఔత్సాహికులకు శిక్షణ ఇప్పించడానికి ఓ భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. ఇందుకు హైదరాబాద్‌లో ఉన్న అభిరామ్‌ క్రికెట్‌ అకాడమీని వేదికగా చేసుకోవాలని భావిస్తున్నాను’ అని వివరించారు.

ఐపీఎస్‌ అధికారి అయినా ఆయనలో గర్వం కొంచెం కూడా కనపడదు. సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. సమాజానికి ఏదో చేయాలని తపన పడతారు. చెరగని చిరునవ్వు రమేష్ సొంతం. వర్షం వస్తే ఆయనలోని చిలిపితనం బయటకు వస్తుంది. పిల్లలు క్షేత్ర, అభిరామ్‌తో కలిసి చిన్నపిల్లాడిలా తడుస్తారు. డ్యాన్స్‌ చేస్తారు. వర్షంలోనూ స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడతారు. ప్రకృతిని ప్రేమిస్తారు. ఈ ముగ్గురు పిల్లలు చేసే అల్లరిని ఆస్వాదిస్తుంటారు ఆ ఇంటి హోమ్‌ మినిస్టర్‌ డాక్టర్‌ సుష్మా రెడ్డి. రమేష్ హైదరాబాద్‌ వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులను పోగేసుకుని ఫామ్‌ హౌజ్‌లో సేదతీరతారు. ఈ ఫామ్ హౌజ్ లోనే అచీవర్స్ స్టోరీస్ టీముతో ఆత్మీయంగా తన స్వగతాన్ని పంచుకున్నారు.