అంగన్‌వాడీల తొలగింపునకు సన్నాహాలు?


అంగన్‌వాడీల తొలగింపునకు సన్నాహాలు?
తదుపరి చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలుకొత్త నియామకాలకు సంబంధించి రోస్టర్‌ పాయింట్ల సేకరణ

ఈనాడు, అమరావతి: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 40 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలను విధుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

షోకాజ్‌ నోటీసుల్లో పేర్కొన్న గడువు పూర్తయిన నేపథ్యంలో తదుపరి చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే నిబంధనల మేరకు అనుసరించాల్సిన విధానంపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రోస్టర్‌ పాయింట్ల వివరాలు సేకరించారు. ఇతర పనులు చేపట్టేందుకు శనివారం రాత్రి, ఆదివారం కూడా క్షేత్రస్థాయిలో అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశాలు వెళ్లాయి.

నామమాత్రంగానే విధుల్లోకి..

విధుల్లో చేరేందుకు అంగన్‌వాడీలకు శనివారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వం గడువిచ్చింది. సాయంత్రం 4 గంటల వరకు చేరినవారి, చేరనివారి వివరాలు తీసుకుంది. కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే 5 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో అసత్యాలు పేర్కొన్నారని, చర్యలు తీసుకునే ముందు తమ వాదనను వ్యక్తిగతంగా వినాలని అంగన్‌వాడీలు సమాధానమిచ్చారు. దీన్ని అనుసరించాల్సిన అవసరం లేదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించినా… ఎన్ని రకాలుగా వారిపై ఒత్తిడి తెచ్చినా శనివారం నాటికి విధుల్లో చేరింది 10 శాతంలోపే. అంగన్‌వాడీలు సంఘటితంగా పోరాట ఉద్ధృతిని కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.04 లక్షల మంది అంగన్‌వాడీలున్నారు.

See also  ROSA – Recognition of Service Association – ఇక రోసా కత్తి… ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తే వేటు వేయడమే…అసలు ఏమిటీ రోసా..