ఎన్నికల వరాలపై జగన్ కసరత్తు – మహిళలకు ఉచిత ప్రయాణం, రుణమాఫీ, ఐఆర్..!?


సీఎం జగన్ వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ అభ్యర్దుల ఎంపికపై ముఖ్యమంత్రి కసరత్తు తుది దశకు చేరింది. ఈ రోజు లేదా రేపు ఇంచార్జ్ మార్పుల చివరి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.
ఇదే సమయంలో ఎన్నికల్లో మహిళలు, ఉద్యోగులు, రైతులు లక్ష్యంగా కీలక నిర్ణయాల దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 31న జరిగే మంత్రివర్గంలో ఆమోదం దిశగా సమావేశ అజెండా పై సీఎం జగన్ నేరుగా సమీక్ష చేయటం ఆసక్తి కరంగా మారుతోంది.

కీలక నిర్ణయాలు: ముఖ్యమంత్రి జగన్ మరోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారు. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే భీమిలి సిద్దం సభ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించారు. 2019 ఎన్నికల సమయంలో 99 శాతం జగన్ అమలు చేసారు. అటు ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో..సంక్షేమ హామీలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి.
దీంతో..జగన్ అలర్ట్ అయ్యారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 31న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసారు. ఎన్నికల వేళ రైతులు, మహిళలు, ఉద్యోగులకు కొత్త వరాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, కేబినెట్ అజెండాలో చేర్చాల్సిన అంశాల పైన ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేస్తున్నారు.

మంత్రివర్గంలో ఆమోదం: వచ్చే నెల 20 తరువాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో, ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల తరువాత ఏపీ బడ్జెట్ కు తుది రూపు ఇవ్వనున్నారు.
ఈ సారి మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ నిర్వహణ పైన ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పైన ప్రభుత్వం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఇచ్చేందుకు మరింత సమయం అవసరం. ఈ లోగా ఉద్యోగులకు ఐఆర్ (మధ్యంతర భృతి) ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీని పైన ఉద్యోగ సంఘాలతోనూ ప్రభుత్వం చర్చలు చేపట్టనున్నట్లు సమాచారం.

ఎన్నికల వరాలు: ఇక, రైతులకు రుణమాఫీ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు అధికర వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదే విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పైన కర్ణాటక, తెలంగాణలో ఆదరణ కనిపిస్తోంది. ఏపీలో ఈ పథకం అమలు పైన ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ఇతర రాష్ట్రాలో అధ్యయనం చేసారు. ఆర్దిక భారం, లాభ నష్టాల పైన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
దీని పైన ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు దిశగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..ఎన్నికల ముందే హామీలను ప్రకటించటం..అమలు చేయటం పైన సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

See also  వైసీపీలో భారీ మార్పులు, చేర్పులు.. జగన్‌ చతుర్ముఖ వ్యూహం ఎలాంటి ఫలితం ఇవ్వనుంది?