చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఒకే ఒక్కడిగా..!


టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అఫ్గానిస్థాన్‌తో ఇండోర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20తో హిట్‌మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు.
2007లో భారత్ తరపున అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన హిట్ మ్యాన్ తాజా మ్యాచ్‌తో 150 టీ20 మ్యాచ్‌ల మైలు రాయిని అందుకున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లలో రోహిత్ శర్మ తర్వాత ఐర్లాండ్ ప్లేయర్ స్టిర్లింగ్ ఉన్నాడు. ఇప్పటి వరకు స్టిర్లింగ్ 134 మ్యాచ్‌లు ఆడాడు. మరో ఐర్లాండ్ ప్లేయర్ డాకర్లెల్ (128), పాకిస్థాన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ (124), న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ (122) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

 

2010లోనే అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 116 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 44 పరుగులు చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు సాధిస్తాడు. మరో 147 పరుగులు చేస్తే టీ20ల్లో నాలుగు వేల పరుగుల మార్క్‌ను అందుకున్న రెండో భారత ప్లేయర్‌గా నిలుస్తాడు.

భారత్ తరపున విరాట్ కోహ్లి మాత్రమే ఈ ఘనతను అందుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేస్తే టీ20ల్లో విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ చరిత్రకెక్కుతాడు. ఇప్పటివరకు 53 మ్యాచ్‌లకు టీమిండియా సారథిగా కొనసాగిన రోహిత్ శర్మ 40 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు.

తాజా మ్యాచ్‌తో పాటు చివరి మ్యాచ్ గెలిస్తే.. 54 మ్యాచ్‌ల్లో 42 విజయాలు నమోదు చేస్తాడు. అప్పుడు ధోనీ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. మహేంద్ర సింగ్ ధోనీ 42 మ్యాచ్‌ల్లో విజయాన్ని అందించాడు. అతనితో పాటు అస్గర్ (అఫ్గానిస్థాన్), బాబర్ అజామ్ (పాకిస్థాన్), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్), బ్రెయిన్ మసబా (ఉగాండ) ఈ రికార్డును కలిగి ఉన్నారు.

 

See also  Virat Kohli: అతడితో కాఫీ తాగాలని ఉంది.. టెన్నిస్ దిగ్గజం కోసం కోహ్లీ ఎదురు చూపులు