IMPS new rules | మొబైల్ నెంబర్స్‌తోనే ట్రాన్సాక్షన్స్.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి


ఫిబ్రవరి 1 నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ విషయంలో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. నేరుగా లబ్దిదారుడి ఫోన్‌ నెంబర్‌తో 5 లక్షల రూపాయల వరకు పంపించుకోవచ్చు.
ఇందుకు లబ్దిదారుడి బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ వంటివి ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేదు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఇఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఈ మేరకు కొత్త రూల్‌ను తీసుకు వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఇమిడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (ఐఎంపీఎస్‌) కీలకమైన మార్పులు చేయనుంది.

బ్యాంక్‌ అకౌంట్ల మధ్య జరిగే డబ్బు ట్రాన్స్‌ఫర్‌ విషయంలో ఈ మార్పులు చేస్తోంది. నగదును మరింత సులభంగా బదిలీ చేసేందుకు అనుగుణంగా మార్పులు చేస్తోంది. ఈ కొత్త రూల్‌ ప్రకారం నగదు పంపించాల్సిన వారి పేరు, బ్యాంక్‌ అకౌంట్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ వంటి వివరాలు అవసరం లేకుండానే కేవలం అకౌంట్‌తో లింక్‌ అయిన ఫోన్‌ నెంబర్‌ ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఒకేసారి బదిలీ చేయవచ్చు.
ఈ కొత్త నిబంధన మూలంగా డబ్బులు అందుకునే వారి వివరాలు నమోదు చేసిన సమయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు, అకౌంట్‌ యాడ్‌ చేసుకున్న తరువాత జరిగే జాప్యాన్ని నివారించేందుకు ఉపయోగపడుతుంది. డబ్బు ట్రాన్స్‌ఫర్‌ కావడానికి ముందే రియల్‌ టైమ్‌లో లబ్దిదారుడి వివరాలను చెక్‌ చేస్తుంది. దీని వల్ల పొరపాట్లు దొర్లకుండా నివారించవచ్చని ఐఎంపీఎస్‌ తెలిపింది.

మెరుగుపరిచిన ఈ విధానం పూర్తిగా యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపింది. ఐఎంపీఎస్‌ సర్వీస్ 24 గంటలు పని చేస్తుంది. ఆన్‌లైన్‌ ఆర్ధిక లావాదేవీలు మరింతగా పెరిగేందుకు ఇది దోహద పడుతుందని పేర్కొంది. దీన్ని వినియోగించుకునేందుకు యూజర్లు మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లోకి వెళ్లి ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సెక్షన్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ కోసం ఐఎంపీఎస్‌ విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. తరువాత మీరు డబ్బు పంపించాల్సిన వారి మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి, లబ్దిదారుడి బ్యాంక్‌ పేరును ఎంపిక చేయాలి. బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ కాని, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ కాని అవసరంలేదు. మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసిన తరువాత 5 లక్షల పరిమితికి లోబడి ఎంత ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారో ఆ మొత్తాన్ని ఎంటర్‌ చేసి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. లావాదేవీ పూర్తి అయ్యేందుకు మీకు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

See also  Cricket టీం ఇండియా కి వ్యతిరేకంగా ఆడడమే నా లక్ష్యం.. భారత్ ప్లేయర్ సంచలన కామెంట్స్..!