Spirituality: దేవుడు తినడు కదా మరి నైవేద్యం ఎందుకు పెట్టాలి!


Spirituality: దేవుడు తినడు కదా మరి నైవేద్యం ఎందుకు పెట్టాలి!

Spirituality: ఏ పూజ చేసినా, భగవంతుడిని ఆరాధించినా పూజ చేసే విధానంలో ఎన్ని మార్పులున్నా చివరికి నైవేద్యం మాత్రం అందరూ సమర్పిస్తారు.
ఆయా దేవతా రూపాన్ని బట్టి నివేదన మారుతుంది కానీ నైవేద్యం సమర్పించడం మాత్రం మానరు. అసలు దేవుడు తింటాడా..మరి నైవేద్యం ఎందుకు పెట్టాలి…

తిరుమలలో శ్రీవారికి రోజంతా రకరకాల నైవేద్యాలు,పూరీ జగన్నాథుడి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు నివేదించే పాత్రలతో గర్భగుడి నిండిపోతుందేమో..ఇక మిగిలిన ఆలయాల్లోనూ స్వామి, అమ్మవార్లకు భోగం సమర్పిస్తుంటారు. ఇవన్నీ దేవుడు తింటాడా అంటే తినడు కదా..ఆ విషయం మరి సమర్పించేవారికి తెలియదా అంటే తెలుసు.. మరెందుకు
నైవేద్యం ఎందుకంటే
భగవంతుడికి సమర్పించే నైవేద్యాలను భగవంతుడు తినడు. కానీ పూజించేవారికి భగవంతుడిపై ఉన్న కృతజ్ఞతాభావాన్ని సూచిస్తుంది నైవేద్యం. లోకంలో మనిషి బతకడానికి భుజించే ఆహారపదార్థాలన్నీ ప్రకృతి ప్రసాదించినవే. ప్రకృతిని సృష్టించి చల్లగా కాపాడుతున్నందుకు ఆ దేవుడికి ఈ జీవుడు కృతజ్ఞతాపూర్వకంగా అర్పించేదే నైవేద్యం. మనిషి జీవితం త్యాగ భావనలతోనే పరిపూర్ణమవుతుందనే సత్యాన్ని చెబుతుంది ఈ నివేదన. తాను అనుభవించడంకన్నా ఇతరులకు పంచడంలోనే ఆనందం ఉందన్నది ఆంతర్యం
ప్రసాదానికి ఎందుకంత రుచి
ఏ పూజలో అయినా నైవేద్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పూట గడవని నిరుపేద నుంచి కోట్లకు పడగెత్తిన వారి వరకూ ఎవరి శక్తికి తగ్గా నైవేద్యం వారు సమర్పించుకుంటారు. భగవంతుడికి మాత్రం అందరూ సమానులే. భక్తితో ఏమిచ్చినా తీసుకుంటాడనేందుకు భక్త శబరి, భక్త కన్నప్పలే నిదర్శనం. వాస్తవానికి భగవంతుడి దృష్టి ప్రసరించిన ప్రతి పదార్థం అమృతమయమై, శరీరంలో తేజస్సును- ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుందని ప్రాచీనగ్రంథాలు చెబుతున్నాయి. అందుకే గమనిస్తే ఇంట్లో ఎంత శ్రద్ధగా చేసినా ఆ రుచి రాదు కానీ ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నివేదించిన తర్వాత తీసుకునే ఆ ప్రసాదం రుచి అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలామంది అంటుంటారు కదా.. గుడిలో పులిహోరలా లేదు, గుడిలో దద్ధ్యోజనంలా లేదని…దానికి కారణం అందే.. స్వామివారి చూపు , అక్కడున్న ప్రశాంత తరంగాలు ప్రసాదంలో ప్రసరించి ఆ రుచిని ఇస్తాయన్నది పండితుల మాట
ఇంకా చెప్పాలంటే!

ఆహారం తినే ప్రతిసారి ఇది నేను సంపాదించినది అన్న అహంకారం లోలోపల ఉంటుంది. కానీ భగవంతునికి దాన్ని అర్పించాక తినడం వల్ల అహంకారం దశ దాటి అది భగవంతుడి అనుగ్రహం అన్న ఆలోచన వస్తుంది
నైవేద్యం కోసం వండే ఆహారాన్ని రుచి చూడకూడదని కూడా ఎందుకంటారంటే..వంటని కేవలం రుచి కోసం కాకుండా, ఓ పవిత్ర యజ్ఞంగా భావించమన్న సూచన. ఇలా రూపొందించిన ఆహారాన్ని సాత్వికత చేకూరుతుంది. ఆ ఆహారం తిన్నవారిలోనూ పవిత్ర భావనలు చోటు చేసుకుంటాయి.
మనకు లభించిన ఆహారాన్ని సాటిజీవులతో పంచుకోవాలనీ, ఇంటికి వచ్చిన అతిథల ఆకలి తీర్చాలనీ… నైవేద్యం మనకి సూచిస్తుంది.
మనం సంపాదించిన ప్రతి రూపాయీ నీతిగా ఉండాలని అర్థం. సంపాదన కోసం తెలియక చేసిన తప్పులని క్షమించమనీ, తెలిసి చేసిన తప్పులను మరోసారి చేయననీ… ఆ భగవంతుని వేడుకునేందుకు ఇదో విలువైన అవకాశం.
ఆహారాన్ని ఆ భగవంతునికి సమర్పించడంతో ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్న సత్యం గుర్తుకువస్తుంది. ఆ అన్నాన్ని వృధా చేయకూడదన్న విచక్షణ కలుగుతుంది
కొంతమంది తినే అన్నం ముందు కూర్చుని ఆహారానికి ఉన్న పరమార్థం మరిచిపోయి జిహ్వచాపల్యానికే ప్రాధాన్యతని ఇస్తారు. అదే నైవేద్యం పెట్టిన ఏ పదార్థాన్ని అయినా విమర్శించకుండా తింటారు..అంటే ఆహారానికి వంక పెట్టకూడదన్నది ఇందులో ఆంతర్యం
మన జీవితంలో కంటి ముందు ఉండే అగ్నిగుండం మన జీర్ణకోశమే! ఆ అగ్నిని శాంతింపచేసే ద్రవ్యం ఆహారం. అందుకే మన ఒంట్లోని అగ్నిని జఠరాగ్ని అన్నారు పెద్దలు. యజ్ఞగుండంలో తగినంత అగ్నిని వేస్తూ దానిని పవిత్రంగా చూసుకుంటామో..మన జఠరాగ్నిని కూడా అంతే పవిత్రంగా చూసుకోవాలి. మనం అందులో వేసే ఆహారాన్ని బట్టే మనసూ, శరీరమూ ఆరోగ్యంగా ఉంటాయి.

See also  Kalagnanam Ayodhya : అయోధ్య విషయంలో బ్రహ్మంగారు చెప్పిన షాపింగ్ నిజాలు..!