Gandhiji letter -సరిగ్గా 80ఏళ్ల క్రితం..రెండో ప్రపంచ యుద్ధం మొదలైన రోజు..మహాత్మా గాంధీ స్వ దస్తూరీ తో రాసిన లేఖ వెలుగులోకి….వివరాలు…


జెరూసలేమ్‌: సరిగ్గా 80ఏళ్ల క్రితం..రెండో ప్రపంచ యుద్ధం మొదలైన రోజు..మహాత్మా గాంధీ స్వదస్తూరీతో ఓ లేఖ రాశారు. యూదులకు శాంతి శకం రావాలని ఆకాంక్షిస్తూ బాంబే జియోనిస్టు అసోసియేషన్‌ (బీజడ్‌ఏ)కు నేతృత్వం వహిస్తున్న ఎ.ఇ.షోహెత్‌కు ఆయన ఈ లేఖ పంపారు. ఈ లేఖ రాసిన 80 ఏళ్ల తరవాత ఇప్పుడు ఇజ్రాయెల్‌లోని జాతీయ గ్రంథాలయం ఆన్‌లైన్‌లో తొలిసారి విడుదల చేసింది.
ఎనభై ఏళ్ల కిందట గాంధీ రాసిన ఓ లేఖను ఇజ్రాయెల్ జాతీయ గ్రంథాలయం విడుదల చేసింది. ఈ లేఖలో అప్పటి బాధిత యూదు ప్రజల జీవితాల్లో శాంతి శకం ప్రారంభమవ్వాలని గాంధీ మహాత్ముడు ఆకాంక్షించారు. ఈ లేఖను అప్పటి బాంబేలోని యూదుల ప్రతినిధి ఏ.ఈ.షోహెట్‌కు రాశారు. ‘‘డియర్‌ షోహెట్‌, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ(యూదు) బాధిత ప్రజల జీవితాల్లో శాంతి శకం ఆరంభంతో నూతన సంవత్సరం జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఎన్‌ఎల్‌ఐ ఇన్‌ఛార్జి స్పందిస్తూ.. యూదులపై నాజీల హింస ఆనాడు ప్రపంచ పౌరులను ఏ స్థాయిలో ఆందోళన కలిగించిందో ఈ లేఖ ద్వారా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ లేఖ రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సెప్టెంబరు 1, 1939లో రాసినట్లు తెలుస్తోంది.

20వ శతాబ్దపు అనేక జ్ఞాపకాలు, చరిత్రాత్మక ఆధారాలను వెలికితీసే క్రమంలో లేయర్ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఎన్‌ఎల్‌ఐ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తాజాగా ఈ లేఖ వెలుగులోకి వచ్చింది. దీన్ని ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా ఉంచినట్లు తెలిపారు. గాంధీ 150వ జయంతి ఉత్సవాలను భారత్‌ ఘనంగా జరపుకోనున్న తరుణంలో ఈ లేఖ బహిర్గతమవడం ప్రాధాన్యం సంతరించుకొంది. అప్పట్లో గాంధీ మద్దతు కోసం షోహెట్‌ చాలా ప్రయత్నించారని.. అయితే ఏ సమస్యకైనా సత్యం, అహింస, సహాయనిరాకరణే ఆయుధాలని గాంధీ అప్పట్లో యూదులకు సూచించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు.

See also  నోటు పై గాంధీ గారి బొమ్మ ఎలా వచ్చిందో తెలుసా…ఎన్నో గాంధీగారి చిత్రాలు ఉండగా….ఆ ఒక్క ఫోటోనే ముద్రిస్తారు దేనికి… అసలు ఆ ఫోటో ఎప్పుడు, ఎక్కడ, ఎవరు తీశారంటే
,