Brain Chip | మనిషి మెదడులో తొలిసారిగా బ్రెయిన్‌ చిప్‌.. చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్ కంపెనీ


మనిషి మెదడులో అధునాతన చిప్‌
మొదటిసారిగా అమర్చిన ఎలాన్‌ మస్క్‌ కంపెనీ
బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌తో విధులు
శారీరక, మానసిక సమస్యలకు మేలైన పరిష్కారం
పక్షవాతం, పార్కిన్‌సన్స్‌ వంటి రోగాలకూ చెక్‌!
Brain Chip | న్యూయార్క్‌, జనవరి 30/(స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో): రామ్‌ కథానాయకుడిగా, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా చూశారా? ఆ చిత్రంలో హీరో మెదడులో ఓ చిప్‌ను అమరుస్తారు. సినిమాలో ఆ దృశ్యాన్ని చూసి ఇది నిజంగా సాధ్యమా? అని అనుకొన్నవాళ్లు చాలామందే ఉంటారు. అయితే, నిజ జీవితంలో ఆ ఫీట్‌ను చేసి చూపించింది అమెరికా స్టార్టప్‌ కంపెనీ న్యూరాలింక్‌. మనిషి మెదడులో తొలిసారిగా బ్రెయిన్‌ చిప్‌ను అమర్చి చరిత్ర సృష్టించింది.

అంతేకాదు.. ఈ చిప్‌ ద్వారా మెదడుకు, కంప్యూటర్‌కు నేరుగా అనుసంధానం చేసే దిశగా ప్రయత్నాలు చేసింది కూడా. ఈ మేరకు న్యూరాలింక్‌ వ్యవస్థాపకుడు, ఎక్స్‌ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మంగళవారం వెల్లడించారు. ‘మనిషి మెదడులో చిప్‌ ప్రవేశపెట్టాం. దీని ద్వారా న్యూరాన్ల కదలికలను గుర్తించాం’ అని ఆయన ట్వీట్‌ చేశారు. చిప్‌ అమర్చిన వ్యక్తి వేగంగా కోలుకుంటున్నట్టు, తొలి ఫలితాల్లో స్పష్టమైన ‘న్యూరాన్‌ స్పైక్‌ డిటెక్షన్‌’ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ చిప్‌నకు ‘ఎన్‌1(లింక్‌)’గా నామకరణం చేశారు.

ఏమిటీ ఎన్‌1?
మనిషి మెదడు, వెన్నెముక సంబంధ సమస్యలపై అధ్యయనం చేయడం, పక్షవాతం వచ్చిన మనిషి కంప్యూటర్‌ సాయంతో అవసరమైన పనులు నిర్వర్తించడం కోసం తీసుకొచ్చిందే చిప్‌ ‘ఎన్‌1’. ఈ చర్యలను ‘ప్రిసైజ్‌ రోబోటికల్లీ ఇంప్లాంటెడ్‌ బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ (ప్రైమ్‌)’గా పిలుస్తున్నారు.

ఎలా పనిచేస్తుందంటే..
మెదడులో అమర్చే ఎన్‌1 చిప్‌ 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. వెంట్రుకలో 20వ వంతు మందం ఉండే సన్నటి దారాల్లాంటి ఎలక్ట్రోడ్లు ఈ చిప్‌లో ఉంటాయి. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి మెదడుకు ఈ సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే 3 వేలకు పైగా సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఉంటూ అటూఇటూ వంగేలా ఉంటాయి.

ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌నకు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. ఇలా మెదడు కదలికల సిగ్నల్స్‌ను రికార్డు చేసిన ఈ చిప్‌.. వైర్‌లెస్‌గా ఓ యాప్‌నకు ఆ వివరాలను చేరవేస్తుంది. మెదడు ద్వారా ఆలోచిస్తూ కంప్యూటర్‌ మౌస్‌ కర్సర్‌ను కదలించేలా, కీబోర్డు అక్షరాలను ఎంటర్‌ చేసేలా ప్రాథమికంగా పరిశోధనలు చేయనున్నారు.

See also  👯‍♂️దొడ్డిగుంట | ఈ ఊరి బావిలో నీళ్లు తాగితే కవలలు గ్యారంటీ..

 

నాలుగు నెలల్లోనే..
కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్‌ -కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌’ ప్రయోగాలకు అమెరికాలోని ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఐ) గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది. న్యూరాలింక్‌ అభివృద్ధి చేసిన ఈ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని వెల్లడైనట్లు న్యూరాలింక్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ చిప్‌ సాయంతో ఒక కోతి వీడియో గేమ్‌ను కూడా ఆడినట్టు వెల్లడించారు. అయితే, మనుషుల మెదడుకు ఈ చిప్‌ను అమర్చి, ట్రయల్స్‌ నిర్వహించేందుకు న్యూరాలింక్‌కు గత సెప్టెంబర్‌లోనే అనుమతులు వచ్చాయి. దీంతో నాలుగు నెలల రికార్డు సమయంలోనే ఈ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించినట్టు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఉపయోగాలేంటి?
నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వల్ల కాళ్లు, చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను ఏఐ (కృత్రిమ మేధ) ఆధారంగా ఈ చిప్‌ సాయంతో మెరుగుపరిచే అవకాశమున్నది. ఈ చిప్‌ సాయంతో పక్షవాతం వచ్చినవాళ్లు కూడా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లను సులభంగా ఉపయోగించగలుగుతారు.

మెదడు ఆదేశాల మేరకు శరీరంలోని అవయవాల పనితీరు ఆధారపడి ఉండటంతో.. మెదడు ఆదేశాలు అందక చచ్చుబడిపోయిన అవయవాలను కూడా ఈ చిప్‌ సాయంతో సిగ్నల్స్‌ పంపి తిరిగి పనిచేయించవచ్చు.
డిమెన్షియా, పార్కిన్‌సన్స్‌, అల్జీమర్స్‌ వంటి మానసిక సమస్యల చికిత్స కోసం ఈ చిప్‌ను వాడొచ్చని నిపుణులు
చెబుతున్నారు.
అవసరమైన ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలను మెదడులోని చిప్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని.. కంటిచూపు, వినికిడి వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని పేర్కొంటున్నారు.
ఈ చిప్‌ సాయంతో హార్మోన్‌ స్థాయిని నియంత్రించొచ్చని, కుంగుబాటును దూరం చేసుకోవచ్చని కూడా పరిశోధకులు చెబుతున్నారు.
స్మార్ట్‌ఫోన్స్‌, కంప్యూటర్స్‌ను తాకకుండానే చిప్‌ సాయంతో ఆపరేట్‌ చేసే అవకాశమున్నది.

, ,