500 ఎకరాల భూమి దానం.. రిక్షాలో అసెంబ్లీకి..


‘బండెనకబండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో నైజాము సర్కరొడా’ అంటూ రైతాంగ కార్యకర్త బండి యాదగిరి రాసిన ఈ పాట దోపిడీ, పోరాటం ఉన్నన్నాళ్లు చిరస్మరణీయమే.
అయితే ఈ పాటకు ప్రేరణగా నిలించింది భీమ్‌రెడ్డి నర్సింహారెడ్డి, రావినారాయణరెడ్డి అని ఎంత మందికి తెలుసు. యాదగిరి లాంటి చదువురాని కార్యకర్తలకు చదువు పోరాటాన్ని నూరిపోశారు రావినారాయణరెడ్డి.

భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పెత్తందారీ వ్యవస్థను పెకిలించేందుకు పిడికిలి బిగించిన ధీశాలి. నమ్మిన సిద్ధాంతాన్ని తుదిశ్వాస వరకూ ఆచరించిన మహనీయుడు. పద్మవిభూషణ్‌ అవార్డుగ్రహీత రావి నారాయణరెడ్డి. నేడు 30వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవల్ని స్మరించుకుందాం.

తెలంగాణ విమోచన జరిగి సరిగ్గా 75 ఏళ్ల సందర్భంగా వజ్రోత్సవ వేడుకులు జరుగుతున్న సందర్భం నుంచి రావినారాయణరెడ్డిని స్మరించుకోవడం యాదృచ్చికం. నారాయణరెడ్డి 1908, జూన్‌ 4న ఉమ్మడి నల్లగొండ జిల్లా బొల్లేపల్లిలో జన్మించారు. హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌ మిడిల్‌ స్కూల్లో ఫస్ట్‌ఫారం చదువుకున్నారు.

అక్కడ నుంచి ఎస్‌.ఎల్‌సీ వరకు హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ హైస్కూల్లో చదివారు. నిజాం కాలేజీలో ఇంటర్‌ చదివారు. 1940వ దశకంలో హైదరాబాద్‌లో ప్లేగు, కలరా వంటి వ్యాధులు ప్రబలిన సమయంలో స్వాతంత్ర్య సమరయోధురాలు పద్మజానాయుడు నాయకత్వంలోని ప్లేగు నివారణ కమిటీ ద్వారా పలు సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. భారత జాతీయోధ్యమ స్ఫూర్తితో బద్దం ఎల్లారెడ్డితో కలిసి 1930లో కాకినాడ వెళ్లి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు.

గాంధీజీ పిలుపు మేరకు సొంతూరి (బొల్లేపల్లి)లో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. రాష్ట్రంలో ఖద్దరు ధరించిన తొలి యువకుడు రావినారాయణరెడ్డి. 1967లో తన 60వ ఏట స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి ఆయన వైదొలిగారు.

తొలి తెలుగు సత్యాగ్రాహి

భాగ్యనగర వేదికగా 1933లో ఏర్పడిన హరిజనసేవా సంఘానికి కార్యదర్శిగా ఎంపికయ్యారు. అస్పృశ్యత నివారణ కోసం సహపంక్తి భోజనాలు పెట్టారు. బడుగుజీవుల విద్యావికాసం కోసం వంద పాఠశాలలు, రెండు హాస్టళ్లు నెలకొల్పారు. అస్పృశ్యతా నివారణోద్యమ ప్రచారంలో భాగంగా 1934లో గాంధీజీని నగరానికి ఆహ్వానించారు.

ఆయన వచ్చిన సందర్భంలో నారాయణరెడ్డి భార్య సీతాదేవి ఒంటిపై నగలన్నీ అమ్మగా వచ్చిన సొమ్ముని ”స్వరాజ్య నిధికి” విరాళంగా ఇచ్చారు. మూడుసార్లు ‘ఆంధ్ర మహాసభ’ అధ్యక్షుడిగా కొలువుదీరారు. 1938లో కాంగ్రెస్‌పై నిజాం ప్రభుత్వం నిషేధం ఎత్తివేయాలని సత్యాగ్రహం చేపట్టిన ఐదుగురు కార్యనిర్వాహక సభ్యుల్లో ఒకే ఒక్క తెలుగు వ్యక్తి నారాయణరెడ్డి.

తర్వాత కాలంలో సోషలిస్టు రష్యా ప్రగతికి ముగ్ధుడై, కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితుడయ్యాడు. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించారు.

See also  iphone‌లో “i” అంటే ఏమిటో తెలుసా?

500ఎకరాలు పంపిణీ

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగంగా తనకున్న 700ఎకరాల్లో 500ఎకరాలను పేదలకు పంచారు. 1952 ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్‌ స్థానానికి పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ అభ్యర్థిగా పోటీచేసి దేశంలోనే అత్యధిక మెజారిటీ పొందిన నేతగా చరిత్రలో నిలిచారు. తొలి పార్లమెంట్‌లో ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా సత్కారం పొందారు.

నల్లగొండకు ‘నందికొండ ప్రాజెక్టు’, ‘నడికుడి రైల్వే జంక్షన్‌’ తీసుకురావడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. 1957 ఎన్నికల్లో భువనగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడే ప్రతిపక్ష నాయకుడిగానూ వ్యవహరించారు. ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్నా నిరాడంబర జీవితాన్ని గడిపారు.

అసెంబ్లీకి రోజూ రిక్షాలో వెళ్లేవారు. ఈయన ఖ్యాతిని గుర్తించిన భారత ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. అంతకముందు ఏడాదే ఆయన కన్నుమూశారు.

నారాయణరెడ్డి పేరుతో జూబ్లీహిల్స్‌లో ఆడిటోరియం నెలకొల్పారు. తెలంగాణలో సాంస్కృతికోద్యమాన్ని రాజకీయోధ్యమంగా మలచిన సమరయోధుడు నారాయణరెడ్డి సేవలు ఈ నేలపై అజరామరం. భావితరాలకు ఆదర్శనీయం.

తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన నల్లగొండ నేతలు

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాంను తరిమి నేటికి 75 వసంతాలు గడిచాయి. వేలాది భూములను తమ గుప్పిట్లో పెట్టుకొని నిజాం రాజు, ఆయన అనుచరులు దేశ్‌ముఖ్‌లు, ఖాసీం రిజ్వీ తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చుకున్నారు.

బ్రిటీష్‌ పరిపాలన నుంచి భారతదేశమంతటా స్వేచ్ఛా గీతాలు ఆలపిస్తున్నా తెలంగాణ మాత్రం నిరంకుశ నిజాం చేతుల్లోనే ఉంది. ఈ పాలనను పారదోలేందుకు పల్లెపల్లెన ప్రజా సంఘాలు నిర్మించి సాయుధపోరాటం చేశాయి.

ఈ పోరాటానికి నల్లగొండ జిల్లాకు చెందిన దిగ్గజాలే నాయకత్వం వహించారు. జిల్లాకు చెందిన రావి నారాయణరెడ్డి, భీమ్‌రెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ధర్మభిక్షం, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలాదేవీ, లక్ష్మారెడ్డి, సుద్దాల హన్మంతు, గుర్రం యాదగిరిరెడ్డి వంటి నేతలు ఉమ్మడి జిల్లాలో నలుమూలల నాయకత్వం వహించి సాయుధ శిక్షణ ఇచ్చి పోరాటానికి ఉపిరిలూదారు.

నిజాం ప్రభువుకు, తెలంగాణ సాయుధ పోరాట యోధులకు మధ్య జరిగిన యుద్ధంలో 4వేల మంది అమరులు కాగా, అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే 600 మంది ఉన్నారు. 6వేల మంది క్షతగాత్రులు కాగా, ఉమ్మడి జిల్లాలో 2వేల మంది గాయపడ్డారు.

ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో సాగిన తెలంగాణ సాయుధపోరాటంలో 3 వేల గ్రామాలను విముక్తి చేశారు. లక్షలాది ఎకరాలను భూమలను భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకుని భూమిలేని నిరుపేదలకు పంచారు.