Coffee: డయాబెటిక్ రోగులకు శుభవార్త, రోజూ కాఫీ తాగితే ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు


కాఫీ తాగనిదే తెల్లారదు చాలా మందికి. రోజుకో రెండు కాఫీలు మంచివేనని చాలా అధ్యయనాలు తేల్చాయి. డయాబెటిక్ రోగులకు కూడా కాఫీ మేలే చేస్తుంది. కాకపోతే ఎలాంటి చక్కెర కలుపుకోకూడదు.
డయాబెటిస్ రోగులకు కాఫీతో మరొక ప్రయోజనం కూడా ఉన్నట్టు కొత్త అధ్యయనం తేల్చింది. రోజూ కాఫీ తాగే మధుమేహ రోగుల్లో ‘డయాబెటిక్ రెటినోపతి’ అనే సమస్య రాదని కనుగొంది. కొరియన్ పరిశోధకుల బృందం కాఫీ, డయాబెటిక్ మధ్య సంబంధాన్ని అంచనా వేసేందుకు అధ్యయనాన్ని చేపట్టారు. కొరియాలోని ఇంచియాన్లోని హాంగిల్ ఐ ఆసుపత్రిలో ఆప్తాల్మాలజీ విభాగంలో ఈ పరిశోధనలు జరిగాయి. అధ్యయన ఫలితాలను ‘నేచర్ సైంటిఫిక్’ జర్నల్‌లో ప్రచురించారు.

ఈ అధ్యయనం కోసం దాదాపు మూడేళ్ల పాటూ సాగింది.ఇందులో డయాబెటిక్ రోటినోపతి పరీక్షలు చేయించుకున్న 37,753 మంది పాల్గొన్నారు. అలాగే 1350 మంది టైప్ 2 డయాబెటిస్ రోగులు కూడా ఉన్నారు. డయాబెటిక్ రెటినోపతి – కాఫీ మధ్య పరస్పర సంబంధాన్ని పరిశీలించేందుకు మల్టీవేరయబుల్ లాజిస్టిక్ రిగ్రెషన్ ఫ్రేమ్ వర్క్ లను ఉపయోగించారు. వయస్సు, విద్య, ఉద్యోగం, సంపాదన, ధూమపానం, మద్యపానం, శారీరక శ్రమ, బీఎమ్ఐ, రక్తపోటు, మధుమేహం, హిమోగ్లోబిన్ శాతం… ఇలా ప్రతి అంశాన్ని వారిని అడిగి తెలుసుకున్నారు.

ఫలితం ఇలా…
మధుమేహం ఉన్నవారిలో రోజుకు రెండు కప్పుల కాఫీ కంటే అధికంగా తాగుతున్న వారిలో ‘డయాబెటిక్ రెటినోపతి’ సమస్య కనిపించలేదు. అయితే ఒక కప్పు కాఫీ తాగేవారిలో మాత్రం ఈ ఫలితం భిన్నంగా ఉంది. వారిలో అంతగా ఈ ఆరోగ్యసమస్యను తగ్గించే శక్తి కనిపించలేదు. బ్లాక్ కాఫీ తాగినా కూడా మధుమేహుల్లో డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశం తగ్గినట్టు గుర్తించారు.

డయాబెటిక్ రెటినోపతి అంటే…
ఇది మధుమేహుల్లో వచ్చే కంటి సమస్య. రెటీనాలోని కణజాలంలో రక్తనాళాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితేనే డయాబెటిక్ రెటినోపతి అంటారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో లేనప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనివల్ల చూపు మొదట అస్పష్టంగా మారుతుంది, రంగులను గుర్తించలేరు, కంటి ముందు ఏవో తేలుతున్నట్టు అనిపిస్తుంది. చివరికి చూపు పోతుంది. అందుకే డయాబెటిక్ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య ప్రాథమిక దశలో ఉంటే మధుమేహాన్ని నియంత్రించడం ద్వారా చికిత్స చేయవచ్చు. అదే చూపు పోయే దశలో ఉంటే మాత్రం లేజర్ చికిత్స లేదా ఆపరేషన్ చేయాల్సి రావచ్చు.

See also  Fenugreek Leaves : చలికాలంలో మెంతి ఆకులను తినడం మరిచిపోకండి.. ఎందుకో తెలిస్తే.. ఇప్పుడే తెచ్చుకుని తింటారు..!