Cheyuta NewRules: పెన్షన్‌ ఉంటే చేయూత లేనట్టే. కొత్త దరఖాస్తులకు బ్రేక్


Cheyuta NewRules: వైఎస్సార్‌ చేయూత పథకం లబ్దిదారులకు ప్రభుత్వం గండి కొట్టింది. కొత్త దరఖాస్తుల్లో నిబంధనల పేరిట భారీగా కోత విధించింది. ఇప్పటి వరకు ఈ పథకంలో సామాజిక పింఛన్లు పొందుతున్న వారికి కూడా లబ్ది చేకూర్చారు.
కొత్త దరఖాస్తుల్లో పెన్షనర్ల పేర్లను తొలగించారు. పెన్షన్ పొందుతున్న మహిళలను ఇకపై పథకానికి అనర్హులుగా పేర్కొన్నారు. వైఎస్సార్‌ చేయూత YSR Cheyuta పథకం ద్వారా ఆర్ధిక సహాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వారు ఆర్ధిక సాయం కోసం కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ప్రభుత్వం లక్షలాది మహిళల ఆశలపై సర్కారు నీళ్లు చల్లింది. ఫిబ్రవరి మొదటి వారంలో చేయూత లబ్దిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో వారం రోజుల పాటు పండగలా చేయూత నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో లబ్దిదారుల్లో సామాజిక పెన్షనర్లను మినహాయించారు.
ఏపీలో 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ నిరుపేద మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లల్లో రూ.75 వేల ఆర్థిక సాయం చేసేలా YSR Cheyuta చేయూత పథకాన్ని ప్రకటించారు. 2020లో చేయూత అమలుకు జారీ చేసిన మార్గదర్శకాల్లో ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ లబ్దిదారులను చేయూత పథకం నుంచి మినహాయించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత నిబంధనలను సడలించి వారికి కూడా వర్తింప చేశారు.

2023 జులై, ఆగస్టు నుంచి వాలంటీర్లు తమ పరిధిలో కొత్తగా 45 సంవత్సరాలు నిండిన మహిళలతో దరఖాస్తులు పెట్టించారు. కొత్తగా చేయూతకు దరఖాస్తు చేసుకున్న వారిలో పింఛనర్లకు అర్హత లేదని వారు పథకానికి అనర్హులని స్పష్టం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో మహిళలు పథకానికి అనర్హులుగా మారారు.
చేయూత పథకం కోసం ఎదురు చూస్తున్నవారిలో ఎక్కువగా ఒంటరి మహిళలు, వితంతు పింఛన్‌దారులు ఉన్నారు. స్వయం ఉపాధి పథకాల కోసం ప్రభుత్వం ఇస్తున్న డబ్బును వినియోగిస్తున్నారు. తాజాగా పెన్షనర్లకు చేయూత మినహాయించాలనే నిర్ణయం వారికి అశనిపాతమైంది.

చేయూత పథకంలో పెన్షనర్లకుఅర్హత ఉంటుందా లేదా అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో దరఖాస్తులు దారులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకున్న మహిళలు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆందోళ చెందుతున్నారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న టోల్‌ఫ్రీ కాల్‌ సెంటర్‌ను ఆశ్రయించిన వారికి దరఖాస్తుదారులు పెన్షన్లు పొందితే చేయూత పథకానికి అనర్హులని సమాధానం ఇస్తున్నారు. గతంలో చేయూత పథకం ద్వారా లబ్ది పొందిన వారికి మాత్రం ఈ సారి పథకం వర్తిస్తుందని వివరిస్తున్నారు.

See also  వారంలో డీఎస్సీ – ఖాళీలు ఎన్నంటే..!!

చేయూత ఉద్దేశం ఇది…

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల్లోని 45-60 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750 రుపాయల ఆర్ధిక సాయం అందిస్తారు. నాలుగు విడతల్లో రూ.75వేల రుపాయల్ని మహిళల స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 నాటికి రెండు విడతలుగా ఈ పథకం ద్వారా ఆర్ధిక లబ్ది కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25లక్షల మంది మహిళలకు రూ.9,179.67కోట్ల రుపాయల్ని ప్రభుత్వం చెల్లించింది.

2022 సెప్టెంబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత వైఎస్సార్‌ చేయూత పథకంలో లబ్దిదారులకు నిధులు విడుదల చేసింది. చేయూత పథకంలో చేరాలని భావించే వారు కచ్చితంగా అర్హతులు కలిగి ఉండాలి. 45 ఏళ్ల వయసు తప్పనిసరి. అలాగే 60 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు పథకంలో చేరొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మాత్రమే జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఈ చేయూత స్కీమ్ వర్తిస్తుంది. అలాగే ఆధార్ కార్డులోని వయసును ప్రామాణికంగా తీసుకుంటారు. అందువల్ల ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

వైఎస్సార్ చేయూత పథకంలో చేరాలని భావించే వారు కొన్ని డాక్యుమెంట్లను కచ్చితంగా కలిగి ఉండాలి. చిరునామా రుజువు, ఆధార్ కార్డ్ కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, వయస్సు ధృవీకరణ, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు మొబైల్ నంబర్, రేషన్ కార్డు ఉండాలి.

2023లో మూడో ఏడాది వైఎస్సార్‌ చేయూతలో 4949కోట్ల రుపాయల నగదును 26,39,706మంది మహిళల ఖాతాల్లోకి జమ చేశారు. గత ఏడాది చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ ఏడాది మాత్రం భారీగా లబ్దిదారుల్లో కోత విధిస్తారనే ప్రచారం మహిళల్ని ఆందోళనకు గురి చేస్తోంది.