అయోధ్య రామయ్య దర్శనం వేళలు ఇవే: సేవా టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?


Ayodhya Ram Mandir Darshan timings: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు..
తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాల రాముడిగా కనులవిందుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు.

ఈ మధ్యాహ్నం 12:29 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఆరంభమైంది. 12:31 నిమిషాలకు పూర్తయింది. మొత్తం 86 సెకెండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ముగించారు అర్చకులు. అభిజిత్ ముహూర్తంలో రామ్ లల్లా విగ్రహానికి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగింది. మోదీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్రనాథ్ మాత్రమే గర్భగుడిలోనికి ప్రవేశించారు.

రాములవారికి తొలి పూజలు చేశారు. విగ్రహం కళ్లకు కట్టిన వస్త్రాన్ని మోదీ తొలగించారు. కాటుకను పూశారు. అయోధ్య ఆలయం ప్రధాన అర్చకుడు సత్యేంద్రనాథ్, వారణాశి కాశీ విశ్వనాథ ఆలయం ప్రధాన అర్చకుడు లక్ష్మీకాంత్ దీక్షిత్.. సారథ్యంలో 121 మంది అర్చకులు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా- సామాన్య భక్తులు మంగళవారం నుంచి అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. రోజువారీ పూజాదికాలు యధావిధిగా మొదలవుతాయి. సుప్రభాత సేవతో స్వామివారిని అర్చకులు మేల్కొలుపుతారు. ఆర్జిత సేవలను నిర్వహిస్తారు. అనంతరం సర్వదర్శనానికి అనుమతి ఇస్తారు.

ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు అయోధ్య రామాలయంలో దర్శనాలు మొదలవుతాయి. 11:30 గంటలకు ముగుస్తాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయోధ్యా రాముడిని దర్శించుకోవచ్చు. తెల్లవారు జామున 6: 30 గంటలకు జాగరణ్ హారతిని స్వామవారికి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి ఉంటుంది. సాయంత్రం 7: 30 గంటలకు సంధ్యా హారతితో తలుపులను మూసివేస్తారు.

స్వామివారి సేవా టికెట్లను బుక్ చేసుకోవడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్ సైట్‌ https://online.srjbtkshetra.org/#/login ను సందర్శించాల్సి ఉంటుంది. మొదట తమ మొబైల్ ఫోన్‌ నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం ఆ నంబర్‌కు వచ్చే ఓటీపీి పొందుపర్చడంతో యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది. దీని ద్వారా లాగిన్ అయి, టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు.

See also  Ayodhya Ram Mandir:సాలగ్రామ శిల అంటే ఏమిటి.. ? అయోధ్య రాముడి విగ్రహాన్ని సాలగ్రామ శిలతోనే చేసారా..?