అసెంబ్లీ వేదికగా జగన్ ప్రభుత్వం ఎన్నికల వరాలు – ముహూర్తం ఖరారు..!!


ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. వైసీపీ అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది.
టీడీపీ, జనసేన తమ అభ్యర్దుల తొలి జాబితా ప్రకటనకు సిద్దమయ్యాయి. ఏపీలో బీజేపీ రాజకీయం అంతు చిక్కటం లేదు. కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే మరోసారి అధికారం లక్ష్యంగా అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ కీలక ప్రకటనలకు సిద్దం అవుతున్నారు.

సమావేశాలకు సిద్దం : ఏపీలో ఈ ప్రభుత్వ హాయంలో చివరి అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 5వ తేదీ ఉదయం పది గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడనుంది. సభ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ. బీఏసీ సమావేశం జరగనుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల సమయం కావటంతో ప్రభుత్వం ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ నెల 6న ప్రవేశ పెట్టాలని భావించినా..7వ తేదీన సభలో ప్రతిపాదించేలా నిర్ణయించినట్లు తెలస్తోంది.

కీలక నిర్ణయాలు : ఈ సమావేశాల్లోనే పలు బిల్లులను సభలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల పైన స్పీకర్ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. సమావేశాలు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కొనసాగే ఛాన్స్ ఉంది. చివరి రోజున రెబల్ ఎమ్మెల్యేలను తన ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని స్పీకర్ ఆదేశించారు. ఈ నెల 5వ తేదీ లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సూచించారు. ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. టీడీపీ తమ అభ్యర్దిని బరిలోకి దింపేందుకు సిద్దమవుతోంది. వైసీపీలో సీట్లు దక్కని ఎమ్మెల్యేల మద్దతుతో తమ అభ్యర్దిని గెలిపించు కోవాలని భావిస్తోంది. దీంతో, 8న స్పీకర్ తీసుకొనే నిర్ణయం కీలకం కానుంది.
ఎన్నికల వరాలు : ఇక, ఎన్నికల ముందు చివరి సమావేశాలు కావటంతో పాటుగా.. బడ్జెట్ ప్రతిపాదించే వేళ జగన్ ప్రభుత్వం ఎన్నికల వరాలు ప్రకటించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసామని చెబుతున్న ప్రభుత్వం..మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కొత్త హామీలను సిద్దం చేస్తోంది. మేనిఫెస్టోలో ప్రకటించటానికి ముందే బడ్జెట్ లో ఈ కొత్త వరాలను ప్రస్తావించే అవకాశం ఉందని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా మహిళలు, రైతులు, ఉద్యోగులకు సంబంధించి కొత్త నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఇక ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో..అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చేసే ప్రకటనల పైన ఆసక్తి కనిపిస్తోంది.

See also  CM Jagan: వైసీపీ 5వ జాబితా విడుదల.. కీలక మార్పులు చేసిన అధిష్టానం..